హైదరాబాద్, వెలుగు: దత్తాత్రేయ భక్తుల కోసం టూరిజంశాఖ మరో ఆధ్యాత్మిక యాత్రా ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో ఉన్న గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి ఒక రాత్రి, 2 రోజుల ప్రత్యేక టూర్‌ను ప్రకటించింది. ఈ యాత్రలో భాగంగా మొదటి రోజు ఉదయం 7 గంటలకు బషీర్‌బాగ్‌లోని టూరిజం సీఆర్ఓ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది.
మార్గ మధ్యలో సొంత ఖర్చులతో అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్నం 1.30 గంటలకు గానుగాపూర్ చేరుకుని హోటల్లో చెక్-ఇన్ అవుతారు. భోజన విరామం తర్వాత సాయంత్రం 4 గంటలకు దత్తాత్రేయ ఆలయం, నిర్గుణ పాదుకా మందిరాలను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. సమయాన్ని బట్టి సాయంత్రం 6.30 గంటలకు భీమా-అమర్జా నదుల సంగమ ప్రాంతాన్ని సందర్శించి, రాత్రికి హోటల్లో బస చేస్తారు.
రెండో రోజు ఉదయం 5.30 గంటలకు ఆసక్తి ఉన్న భక్తులు సొంతంగా ఆలయానికి వెళ్లి కాకడ హారతి, అభిషేకంలో పాల్గొనవచ్చు. ఉదయం 7.30 గంటలకు అల్పాహారం తర్వాత హోటల్ ఖాళీ చేస్తారు. 8.30 నుంచి 11 గంటల వరకు కల్లేశ్వర ఆలయం, పవిత్ర ఔదుంబర వృక్షాన్ని దర్శించుకుని, ప్రసాదాలు, పూజా సామాగ్రి కొనుగోలుకు సమయం ఇస్తారు. ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ. 3,500, పిల్లలకు రూ.2,800గా నిర్ణయించినట్లు టూరిజం పీఆర్, మార్కెటింగ్ జీఎం మాన్వీ తెలిపారు. ఈ రుసుములోనే 21 సీట్ల ఏసీ బస్సు ప్రయాణం, గానుగాపూర్‌లో ఏసీ ట్విన్ షేరింగ్ రూమ్‌లో బస, ప్రధాన ఆలయ దర్శన ఏర్పాట్లతోపాటు గైడ్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
